Monday, February 27, 2012

నారదమహర్షి లోకసంచారము చేయ బోవుట

                                                      శ్రీమద్భాగవత మాహాత్మ్యం    ద్వితీయాశ్వాసము
                                                          నారదమహర్షి లోకసంచారము చేయ బోవుట

ఉ. అంతట నెల్ల వారు వెరగంది చెవింగొన నాకసంబునం
వింతగ వాక్యముల్ గలిగె వీరిని నారద మేలుకొల్ప  నీ
యంతటి వాడు పూనుకొను టన్ని విధంబుల మేలు గాదె ని
శ్చింతగ నుండుమా శుభము చేకురు దేవమునీంద్రసత్తమా

ఉ. ధర్మప్రవర్తకుండయిన దైవము వీరికి పూర్ణసత్త్వమున్
నిర్మల తేజమున్ మరల నెప్పటి తీరున నొప్పజేయు స
త్కర్మవిశేషముం గరముదారమనస్కుడవైన నీవు ము
న్నర్మిలి చేయగా వలయు నప్పుడు గల్గు శుభంబు చెచ్చెరన్.

ఆ.వె. సాధు పూరుషులను చక్కగా సేవించి
దాని నెరిగి చేయదగును నీకు
పిదప భక్తిదేవి బిడ్డలు తోడుగా
దిక్కులెల్ల వెలుగ తేజరిల్లు

ఉ. ఆ యశరీరవాణి  యిటు లందరు చక్కగ నాలకింపగన్
తీయగ  బల్కె నారదు మదిం గడు మోదము కల్గె గాని తా
జేయగ  నైన యట్టి   బహు చిత్రవిశేషసుకర్మరూపమే
దోయెరిగింపదేమియని తోడుత నచ్చెరువందె నాతడున్

కం. ఈ  గగన వాణి చెప్పిన
దౌ గహనంబైన కర్మ మది  యెట్టిది నే
నే గతి యెరుక గల మహా
భాగుల నీ వసుధ గుర్తు పట్టెద ననుచున్

ఆ.వె. తలచి నారదర్షి ధరనెల్ల శోధించి
యెవరి వలన చింత యెల్ల దీరు
నట్టిసత్పురుషులనెట్టులైన నెరుంగ
నుత్సహించి బలికె నువిదలకును

ఉ. ఆకస మాడు పల్కులవి యందరు వింటిమి చల్ల నాయె గా
మీకును మానసంబు లిక మేమును నెచ్చట నట్టి  సత్క్రియన్
మాకుపదేశమిచ్చుటకు మాధవు నాజ్ఞను సాధుపుంగవుల్
శ్రీకరు లుందు రట్టి యెడ  చేరగ నౌనిక బోయి వచ్చెదన్

మ. ఇది సత్యంబగు భక్తిదేవి వినుమా యీ జ్ఞానవైరాగ్యముల్
నిదురన్ వీడుటె కాదు తొల్లిటి వలెన్ నీ తోడుగా నిల్చి యిం
కెదురే లేక వసుంధరాతలవిహారేఛ్ఛన్ ప్రవర్తించగా
ముదమారం గను దీవు నీదు యశమున్ మున్ముందు మిన్ముట్టెడిన్

ఆ.వె. మహిత ధర్మ ములకు మకుటాయమానమై
యొప్పు ననుచు భక్తి  యుర్వి కెల్ల
విశదపరచ నేను విఫలుడ నైతినా
విడుతు గాక నారదు డను పేరు

కం. అని పలికి నారదుండును
వనితాజన రక్షణమున వదలుచు జ్ఞానం
బును వైరాగ్యంబును  తా
జనె  తీర్థాటనము జేయు సంకల్పముతో

Saturday, February 18, 2012

నారదమహర్షి విఫలప్రయత్నము

                                                  శ్రీమద్భాగవత మాహాత్మ్యం    ద్వితీయాశ్వాసము
                                                                నారదమహర్షి విఫలప్రయత్నము                

ఉ. సూతుడు శౌనకాదులు విశుధ్ధమనస్కుల కిట్లు బల్కె నో
పూతచరిత్రులార తన ముంగట ప్రాణము లేని యట్లు ని
శ్చేతనులై కనంబడెడు శ్రీకర మూర్తుల నాదరంబునన్
చేతుల తట్టి మేల్కొలుప చెచ్చెర నారదుడుద్యమించుచున్

కం.  పరమేష్ఠి పుత్రుడెంతయు
కరుణామయుడతడు చేరి కడు ప్రేమ సుధీ
వర జ్ఞానమ మేల్కొనుమా
స్ఫురణకురమ్మనుచు తట్టు చుండెడి నొకనిన్

కం.  వైరాగ్యమ లెమ్మనుచున్
నారదుడాదరము మీర నయమొప్పంగన్
తీరుగ తట్టెడు నొక్కని
నారయు నా భక్తిదేవి యక్కజ పడగన్

ఉ. ఎంతగ తట్టి లేపినను యించుక లాభము లేదు నారదుం
డెంతగ నార్చి బిల్చినను యిర్వురు వీనుల బెట్టకుందు రా
వంత ప్రయోజనంబు  గనుబట్టమి కెంతయు చిన్నబోయి ధీ
మంతుడు గాన మౌని పరమాత్ముని చింతన జేసి యంతటన్

చం. చదివెను వేదమంత్రముల చక్కగ వారల చెంత దీక్షగన్
చదివెను నిష్ఠగా నుపనిషత్తుల బోధన లెల్ల కొల్లగన్
చదివెను గీతనుండి మనసార ననేకము లైన శ్లోకముల్
కదలగ జొచ్చి రంత ననఘాత్ములు బిడ్డలు మెల్లమెల్లగన్

ఉ.  వారలు నేత్రయుగ్మము లవశ్యము సోలుచు నుండ మోములం
జారుచు నున్న వెండ్రుకల శాల్మలి  రాశుల భాతి వెంతయున్
నీరసపడ్డ వ్రేళులను నెట్టుచు వెన్కకు కూరుచుండగా
నారద భక్తిదేవులును నాతిసమాజము పొంగెనెంతయున్

ఆ.వె.  లేచి తల్లి వంక జూచిసంతసమున
అమరమునిని విస్మయమున జూచి
అంత లోనె వార లాకలిదప్పులు
తాళ లేని యట్లు ధరను బడిరి

మ. పడి నిద్రావశులైన బాలకుల విభ్రాంతిన్ మునీంద్రుండు నా
పడతుల్ జూచిరి చేష్టలేది సకలోపాయంబులం  వీరలన్
విడకుండుం గద మొద్దునిద్ర యికనా బిడ్డల్ ప్రమాదంబునం
బడినట్లేయని భక్తిదేవి వికలస్వాంతంబునం గ్రుందగన్

కం. ఖిన్నుండై దేవర్షియు
వెన్నుం దలపోసె నెట్టి విధమున మమ్మున్
మన్నింతువొ శ్రీహరి యా
పన్నుల మో పరమపురుష పాహియటంచున్

నారదమహర్షి భక్తిప్రభావమును శ్లాఘించుట

                                                  శ్రీమద్భాగవత మాహాత్మ్యం    ద్వితీయాశ్వాసము
                                                      నారదమహర్షి భక్తిప్రభావమును శ్లాఘించుట                     


శా.  ఏయే వర్ణములం జనించినను  యేయే భూములం బుట్టినన్
యేయే విద్యల నభ్యసించినను యేయే వృత్తులం బట్టినన్
యేయే పుణ్యములాచరించినను యేయే పాపముల్ చేసినన్
నీ యందాదరబుధ్ధి ముక్తి నొసగున్ నిక్కంబు మర్త్యాళికిన్

శా.  ఏయే మానవు లాత్మబంధువుగ నిన్నెంతేని మన్నించు వా
రాయా ధన్యుల పుణ్యమెట్టిదన స్వప్నావస్థయందేని యున్
కాయంబూడ్చుచు కానవచ్చుటకు నా కాలుండశక్తుండు దు
జ్ఞేయంబౌ కలిమాయ వారిదగు సఛ్ఛీలంబునం గ్రుంగెడున్

కం. నిన్నెరిగి యుండు వారల
నెన్నండును ప్రేతభూతనీచగ్రహాదుల్
కన్నెత్తి జూడ నేరవు
మిన్నంటెడు వారి ప్రభకు మిగుల వెరచుచున్

మ. సాంగోపాంగ మహర్నిశల్ చదువులన్ చర్చించునే కాక స
ర్వాంగంబుల్ కృశియింప గొప్పతపముల్ పాటించునే కాక లో
నంగాలుష్యము జ్ఞానవహ్నిబడ నానందించునే కాక  వా
నింగాంచం కృప మోక్షలక్ష్మి కగునే నీవాడు గాకున్నచో

చ. చదువులు పూజ్యమే యుపనిషత్తుల గూర్చి యెరుంగరేమియున్
విదితముగావు ధర్మములు వేడుక నేర్వరు పూజనక్రియల్
ముదితలు చేసినట్టి తపముల్ గనరావటు లయ్యు మోక్షమున్
సదమలభక్తి గోపికలు చక్కగ బొందిరి గాదె ధన్యులై

ఉ. ఆరయ వేయిజన్మలకు నైనను నొక్కని బుధ్ధియందు సం
సారము సారహీనమను చక్కని జ్ఞానము కల్గుటున్నదే
ధారుణి నట్టి వాడొకడు తద్దయు భక్తిని గొల్చుచుండ నా
శ్రీరమణుండు చిత్తమున చేరి వసించెడు వాని కెప్పుడున్

కం. కలియుగమున రక్షింపం
గలిగెడునది భక్తి యనెడు ఘనసాధనమే
కలదేని భక్తి కృష్ణుడు
కలడాతని యెడల ముక్తి కలిగెడు నటుపై

తే.గీ. అల్పదంబులు తీర్థపర్యాటనములు
అల్పదంబులు యజ్ఞయాగాదికములు
స్వల్పదంబులు యోగాది సాధనములు
మోక్షదంబగు హరిభక్తి భూజనులకు

మ. అరయన్నెవ్వడు  హీనదృష్టి హరి భక్తానీకముం జూచునో
నిరయంబాతనికిం దిరంబు మరి లేనేలేదు మోక్షాశయున్
హరిభక్తాళిని గారవించెడు లసద్వ్యాపారమున్నేర్చుచో
మరి నిశ్శ్రేయసనిష్ఠయుం గలుగు తన్మాహాత్మ్యమూలంబనన్

సీ. హరిభక్తుడైన యా యంబరీషుని దిట్ట
      దుర్వాసమునిరాజు గర్వమణిగె
హరిభక్తుడైన ప్రహ్లాదుని బాధించి
     చెడెను హిరణ్యకశిపుడు మున్ను
హరిభక్తుడైన సోదరుని వినిందించి
      రావణదైత్యుండు రాలి పడెను
హరిభక్తులైన వారల పాండవుల జంప
      యోచించి చెడెను సుయోధనుండు
తే.గీ. ఎవరు హరిభక్తులకు ద్రోహమెట్టి దేని
చేయ దలతురో వారికే చేటు గలుగు
అట్టివారికి లోకత్రయంబునందు
కొంచె మైనను శాంతి చేకూర బోదు

చం. అనవుడు భక్తిదేవి హృదయంబున సంతస ముప్పతిల్ల నో 
మునివర ప్రేమమీర కడు మోదకరంబులు పల్కులాడినా
వనయము నీ హృదంతరము బాయక నుండెద లోకపూజ్య నా
తనయుల యార్తి బాపుటకు తప్పక యోచన చేయుమా యనెన్

Tuesday, February 7, 2012

నారదమహర్షి భక్తిదేవి జన్మవృత్తాంతమును ప్రశంసించుట

                                                  శ్రీమద్భాగవత మాహాత్మ్యం    ద్వితీయాశ్వాసము
                                             నారదమహర్షి భక్తిదేవి జన్మవృత్తాంతమును ప్రశంసించుట

కం. వినతాసుతఘనవాహన
ఘనగగనశ్యామదేహ కాంచనచేలా
మునిజనసన్నుత కేశవ
నను బ్రోవుము దేవదేవ నగధర కృష్ణా

చం.  తదుపరి యిట్లు బల్కితిని  తద్దయు ప్రాజ్ఞవు భక్తిదేవి నీ
కిది తగ దీ వెరుంగనిదె కేశవు డెంత దయామయుండొ త
త్పదముల నాశ్రయించగనె దారుణ దుఃఖము లన్నియుం బదా
బదలగు గాదె యూరడిలి  భావన చేయుము విష్ణుదేవునిన్.

సీ.   వచ్చి యల్పుని బారి పడకుండ కాపాడు
    మన్న  రుక్మిణి నేలి నట్టివాడు
తులువలు తనవల్వ లొలువ బోయిన వేళ
      యాజ్ఞసేనిని గాచి నట్టి వాడు
పదునారువేలుగా పడతుల చెరగొన్న
      యసురుని పడగొట్టి నట్టివాడు
పాండవస్నుషపైకి బ్రహ్మశిరంబురా
     నడ్డంబుగా నిల్చినట్టివాడు
తే.గీ. పాహి యనినంత రక్షించ వచ్చువాడు
సర్వకాలంబులందున బర్వువాడు
అన్ని యెడలను తా నిండి యున్నవాడు
నెందు బోయెను గానెంచి కుందె దీవు

కం. హరి వేడుము  హరివేడుము
హరి వేడుక బ్రోవరాడె హరిణేక్షణ శ్రీ
హరిపై నమ్మక ముంచుము
హరియించును శౌరి దుఃఖ మన్ని విధములన్

చం. హరియన నీకు ప్రీతి మరి యాతని కీవును నట్లు ప్రాణమై
వరలెదు గాన నీ పనుచు పట్టున కేగి వసించుచుండు సం
బరమున  నగ్రజన్ములగు వారల యిండ్లను హీనయోనులౌ
నరుల గృహంబులం సమత నారయుచుం వెస నెల్ల వేళలన్

కం.  గడచిన మూడు యుగంబుల
వడుపుగ జ్ఞానంబు మరియు వైరాగ్యంబున్
కడు నొప్పె సాధనములై
పుడమిని గలవారు నియతి మోక్షమునందన్

తే.గీ. కలియుగంబున జ్ఞానంబు కల్లమాట
పూర్ణవైరాగ్యసంసిధ్ధి పుట్టుటరుదు
కనుక వేరొక మార్గంబు జనహితార్థ
మేర్పరింపగ తలపోసి యీశ్వరుండు

 తే.గీ. వినుతగుణశీల వగు నిన్ను విష్ణుదేవు
డాత్మ సద్రూప మూర్తిగా నమర జేసె
నిరుపమానందచిన్మూర్తి నీకు దేవ
దేవు డత్యంత వశవర్తియై వెలుంగు

చం.  నిను సృజియించి వెన్నుడనె నీకిక లోకత్రయంబు నందు స
జ్జనులును  నాకు భక్తులును సత్యదయాపరశాంతమూర్తులున్
ఘను లగువారి పోషణము కార్యము గానగు భక్తిదేవి నీ
పనుపున ముక్తికాంతయును వర్తిలు నీయెడ ప్రీతినుండెదన్

కం. జ్ఞానము వైరాగ్యమునన
గానెగడెడు వీరి నీకు కలుషరహితులన్
నేనిత్తు  నీకు సుతులుగ
మానిని గొనుమనుచు నిన్ను మాధవు డంపన్

ఆ.వె. నాట గోలె నీవు నానాభువనముల
నున్న భక్తకోటి నుచిత రీతి
నెల్ల వేళ మంచి తల్లివగుచు పోష
ణంబు జేయు చుంటి వంబుజాక్షి.

ఉ. ఇవ్విధి ముక్తిదాసియును నెంతయు యోగ్యులు పుత్రులిర్వురుం
పువ్వులబాటజీవితము పొల్పుగ నీకమరార నోర్వలే
కవ్విధి యాజ్ఞచే గలిగి నట్టిదురాసదమున్ గనిష్టమున్
నొవ్వుల కాలమైన కలి నోర్వక ముక్తి కృశింప జొచ్చినన్

కం. కని నీవు ముక్తి కాంతను
పనిచితివిక శీఘ్రముగను వైకుంఠపురం
బున నుండు మొకట నాకున్
పనిగలిగిన పిలుచుదాన వనితా యనుచున్

ఆ.వె. పుత్రసహితవగుచు భూమిని పెక్కండ్రు
తావు లందు తిరిగి నీ వలయగ
జను లుపేక్ష సేయ జవమేది వృధ్ధులై
మందులైరి నీ కుమారకులును

Tuesday, January 17, 2012

సమస్తమును సారహీనమగుటకు కారణము

                                                  శ్రీమద్భాగవత మాహాత్మ్యం    ప్రథమాశ్వాసము
                                                       సమస్తమును సారహీనమగుటకు కారణము

కం. మనుజుల కార్యము లన్నియు
కనుగొన కుత్సితము చేత కలుషితములుగా
జన సారమేది భూతల
మున గల  వస్తువులు చెడెను పుణ్యచరిత్రా    1

కం. సారము చెడి విత్తనములు
నీరసపడి పంట చేలు నిష్ఫలములుగా
మారెను  పండెడునది యా
కారమునకె  తప్ప తాలు ఘనమై యుండెన్    2

కం. ధనలోభంబున విప్రులు
విన నడగిన వారికెల్ల వినిపించుట చే
ఘన భాగవతపురాణం
బునగల సారంబు సర్వమును చెడి పోయెన్.    3

తేగీ. క్రూరకర్ములు రౌరవకూటవాసు
లిలకు దిగివచ్చి నరరూపములను దాల్చి
వేదనిందకు లైవారు విడిదిచేయ
పుణ్యతీర్ధంబులకు సారముడిగిపోయె.        4

తే.గీ.  కామలోభాదిదుర్గుణకలుషబుధ్ధు
లీషణత్రయవిక్షిప్తహీనమతులు
చీటిమాటికి మునివృత్తి చెలగుచుండ
తపము నందున సారంబు తరిగి పోయె        5

తే.గీ.  శాస్త్రమెరుగని వారును చపలమతులు
నాస్తికులు దాంభికులు చెడు నడతనుండి
యోగసాధన మని చెలరేగుచుండ
ధ్యానయోగంపు సారంబు దగ్ధమయ్యె        6

ఆ.వె. పండితులని పేరు బడసిన ఘనులెల్ల
పశువు లట్లు కామపరత నుండి
ముక్తిసాధనమును పూర్తిగా మరువగా
చదువు సార మెల్ల సన్నగిల్లె        7

ఆ.వె.  దైవభక్తి   సంప్రదాయంబు లడుగంటె
విలువ  తరిగె వేద విద్యలకును
సకలదేశములను సాగగా నీరీతి
సారహీన మాయె ధారుణియును        8

చం. కలియుగ ధర్మమిట్టిదగు గావున శ్రీహరి దీని నంతయున్
తెలిసి సహించుచుండు నిది తెల్లము మానక తిట్టుచో కలిన్
కలిగెడు కార్యమేమియును కానము కాలము చే సమస్తమున్
నిలుచును కూలు దోషముల నీవును నేనును నెన్న నేటికిన్    9

కం. అని తన సందేహములకు
వినిపించితి నెఱిగి నట్టి విధమున ప్రీతిన్
ఘనశీల  భక్తిదేవికి
మనమపు డుప్పొంగె  నా సమాధానములన్         10

కలిని పరీక్షిత్తు విడచుట

                                                   శ్రీమద్భాగవత మాహాత్మ్యం    ప్రథమాశ్వాసము
                                                           కలిని పరీక్షిత్తు విడచుటకు కారణము

సీ.  దేవదేవుడు శౌరి దేవకీసుతుడుగా
     భూమికి విచ్చేసి భూరికరుణ
గొల్ల పిల్లల తోడ కొన్నాళ్ళు క్రీడించి
      బ్రహ్మేంద్రమాయల భంగ పరచి
బకకేశిధేనుకవత్సతృణావర్త
       కంసజరాసంధకాలయవన
పౌండ్రకచైద్యాది పాపాత్ములను బట్టి
      వివిధరీతుల వారి  పిలుకుమార్చి
తే.గీ.  ఘోరతర కురుక్షేత్రమహారణమున
లీల మీరగ తగ్గించి నేల బరువు
భక్తపాలను డక్రూరవరదు డంత
తనిసి  యేగెను వైకుంఠధామమునకు         1

కం. హరి యానతి గైకొని కలి
పురుషుడు తన ప్రాభవమును భూవలయమునం
బరపగ గరుకుగ  ధర్మా
చరణము నెడ జనుల నిష్ఠ సమసెను వేగన్    2

కం. కలిలో కలహం బన్నిట
గలుగుటచే శాంతి  యనగ  కనుమరు గాయెన్
పలు దుఃఖంబులు నరులకు
నలము కొనగ మోక్షసాధనంబు లడంగెన్    3  

ఆ.వె. సకల మివ్విధమున వికలంబుగా జేసి
కలిపురుషుడు భూమి కలచు చుండి
ధర్మవృషభు నొకట దండించు చుండగా
వేట లాడ వచ్చె విభు డచటికి        4

ఆ.వె. రూక్షనయనుడై పరీక్షిన్మహారాజు
జంప బోవ కలియు జాల వడకి
పాహి యనుచు భూమిపతి పాదముల పైన
వ్రాలి నంత నతడు వాని జూచి        5

ఉ. ఓ కలి నిన్ను నే మనుచు నుక్కడగించక యుండ వచ్చు నీ
పోకడ సాధుహింసనము భూవిభుడం గద యెట్లు దుష్టునిం
జేకొని గాచ వచ్చు కడు చిన్నిది  యయ్యును  సద్గుణంబనన్
నీ కడ నుండెనేని చన నిచ్చెద ప్రాణము తోడ క్రూరుడా    6

కం. అనగా తన ప్రాణంబులు
తనకుం  బదిలంబు లగుట దలచుచు కలియున్
జనపతితో నిటు బల్కెను
వినుమో యుర్వీశ నాదు విమలగుణంబున్    7

కం. మును గడచిన యుగములలో
మనుజులకున్ మోక్షమిచ్చు మార్గంబులనన్
జననుత సత్యము తపముం
ఘనవిజ్ఞానాతిశయము కష్టతరంబుల్        8

కం. నే నడిపించెడు యుగమిది
భూనాధ విశేషకష్టభూయిష్ఠంబై
జ్ఞానావరోధనకరం
బై నాదుర్నీతి  యేర్చు నరలోకంబున్        9

ఉ. హే నరనాధ యీ యుగమ నేకవిధంబుల దుస్సహంబు గా
నే నొన రించుచుంటినని యెంచకు మియ్యది దైవనిర్మితం
బైన యుగప్రవర్తన మవారితమై చనుచుండు దీనియం
దే నొక చిన్న శాసకుడ నేర్పడ గాంచుము  నీవు సత్యమున్    10

ఉ. ఈ యుగమందు మానవు లనేకములై చను మోక్షసాధనో
పాయము లాశ్రయుంచి బహుభంగుల కష్టములోర్చి గాక నా
శ్రీయుతమూర్తి  నామమును చింతన జేసినచాలు చెచ్చెరన్
మాయ దొలంగి మోక్షపద మందుట తథ్యము కౌరవేశ్వరా    11

ఉ. ఓ మహరాజ చక్రమున కుండెడు నాకులు క్రిందు మీదులై
భూమిని దాకవచ్చుచును ముట్టుచు పిమ్మట మీది కేగుచున్
నీమము తప్పకం దిరుగ నేవిధిగా నొక బండి సాగునో
స్వామి యొనర్చె కాలమను చక్రమునం దటులన్ యుగంబులన్    12

ఆ.వె. ధర్మమునకు నట్లె తగ్గుచు హెచ్చుచు
యుగము యుగమునకును తగిన రీతి
కలుగుచుండు ఖ్యాతి కాలంబునకు నొక్క
కలన నుండ నెట్లు వలను పడును            13

కం. కలదా సుగుణంబను నీ
పలుకుల కుత్తరము నిచ్చి  వసుధాధిప నే
తెలిపిన మాటలుసత్యం
బులు నీ వచియించినట్లు పోనీయగదే            14

కం. హరియంశము నీ యందున
తిరమై యలరార గాంచితిని మ్రొక్కితి నో
నిరుపమవిక్రమ విషయం
బెరిగించితి నన్ను బోవ నిమ్ము నృపాలా        15

తే.గీ విభుడు కలి మాట లాలించి పెద్ద తడవు
మంచి చెడ్డలు చాల యోచించి వాని
యందు దోచెడు సుగుణంబు నందు దృష్టి
నిలిపి వానిని విడువగా నెంచి బల్కె             16

కం. భగవన్నామోచ్చారణ
మగణితముగ జరుగు చోట్ల మసలుటుడుగుమా
తగ దట్లె నీవు జొచ్చుట
జగమున శుచులైన వస్తుసంచయమందున్        17

కం. కలియుం దానికి నొడబడి
తొలగి చనియె గాని వాడు దుష్టుడు పాదం
బుల మీద వ్రాలు మిషతో
నలవోకగ రాజు నప్పు డావేశించెన్            18

Saturday, January 14, 2012

భక్తిదేవి సందేహములు

                                                  శ్రీమద్భాగవత మాహాత్మ్యం    ప్రథమాశ్వాసము
                                                                     భక్తిదేవి సందేహములు

కం. అని తెలుప భక్తిదేవియు
మునివర భూలోకరాజమూర్ధన్యుడునా
గనవచ్చు పరీక్షిత్తుం
డనువుగ కలి దొఱుక జంపకయె విడచె  గదా

కం. పాపాత్ముండగు నీ కలి
నా పృధ్వీపతియుజంప నాలోచించం
డే పుణ్య మతని గాచెను
లోపంబులగప్పి కంఠలుంఠనమునకున్

చం. అదియును గాక యీ తుళువ యక్కట కాలిడి నంత వస్తు సం
పదలు సమస్తముం కలుషభావము నందుచు సారమేది చ
చ్చుదనము జూపగా మిగుల చోద్యము గల్గెడు నాకు వానియం
దుదితము లైన సారములు దోచక యెందున బోవుచున్నవో

ఉ. శ్రీపతి గూడ యీ కలిని ఛిన్నము చేయక చూచుచుండె నీ
పాపపు కాలమందు శుభవర్తనబుధ్ధివిశాలు రెల్ల సం
తాపము నంది క్రుందెదరు ధర్మము న్యాయము గావలేక యో
తాపసిముఖ్య యెందులకు తామరసాక్షుడుపేక్ష  జేసెడున్

కం. ఈ నా సందేహములను
మౌనీంద్రులు మీరు దీర్చ వలయును మరియున్
మీ నుడువుల నా గుండియ
లో నుండిన దుఃఖ మెల్ల రూపరు చుండెన్

తే.గీ.  ఆమె యడిగిన ప్రశ్నల నాలకించి
పల్కితీ గతి నో  తల్లి పరమదివ్య
మంగళాకృతి యడిగిన సంగతులను
తెలియ జెప్పెద  హృదయంబు తేటపడగ

తే.గీ. సావధానవు గావమ్మ సర్వ లోక
పూజ్యవగునీకు బోధించు పుణ్యమిట్లు
నాకు దక్కుట యన పద్మనాభుకరుణ
చేత సమకూరె నని యెంతు చిత్త మందు